Friday, March 24, 2023

Bhaag Saale: క్రైమ్ కామెడీతో వస్తోన్న కీరవాణి చిన్న కొడుకు.. బర్త్‌డే పోస్టర్ అదిరింది!

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) చిన్న కుమారుడు శ్రీసింహ (Sri Simha) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’ (Bhaag Saale). ఈరోజు శ్రీసింహ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘భాగ్ సాలే’ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శ్రీసింహా చాలా సీరియస్‌గా పరిగెడుతున్నారు.

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్‌తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. శ్రీసింహా సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, పృథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి ముఖ్య పాత్రలు పోషించారు.


ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక ఆర్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. రమేష్ కుషేందర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే, ‘ఉస్తాద్’ అనే మరో సినిమాలో శ్రీసింహ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను సైతం ఈరోజు శ్రీసింహ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, కృషి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు. అకీవ బి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో శ్రీసింహ పైలట్‌గా కనిపించనున్నారు.

‘యమదొంగ’ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన శ్రీసింహ.. ఆ చిత్రంలో చిన్నప్పుడు ఎన్టీఆర్ పాత్రను పోషించారు. ఆ తరవాత ‘మర్యాద రామన్న’ సినిమాలోనూ బాలనటుడిగా నటించారు. ‘ఈగ’ సినిమాలోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. చిన్నప్పుడు తన బాబాయ్ ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల్లో నటించిన శ్రీసింహ.. ‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టారు. ఆ తరవాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఇప్పుడు ‘భాగ్ సాలే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Latest news
Related news