Tuesday, March 21, 2023

Vishal: దూసుకొచ్చిన ట్రక్కు.. రెప్పపాటులో తప్పించుకున్న హీరో విశాల్

హీరో విశాల్ (Vishal) రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రస్తుతం ‘మార్క్ ఆంటొని’ (Mark Antony) సినిమా చిత్రీకరణలో ఉన్నారు. అయితే, షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో అనుకోకుండా ప్రమాదం జరిగింది. చిత్రీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన ట్రక్కు ఒకటి విశాల్‌తో పాటు అక్కడున్నవారి మీదుకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను విశాల్‌తో పాటు, ఆయన నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కొన్ని సెకెండ్లు వ్యవధిలో కొన్ని అంచుల దూరంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఆ దైవానికి ధన్యవాదాలు. ఈ ప్రమాదం తరవాత మళ్లీ నా పాదాలపై నిలబడి, చిత్రీకరణలో పాల్గొన్నాను’ అని విశాల్ ట్వీట్ చేశారు. అయితే, ఆయన షేర్ చేసిన వీడియో చూస్తుంటే ఆయన రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడ్డారని స్పష్టమవుతోంది. చెన్నైలో ఒక సెట్ వేసి అందులో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బహుశా ఇది విలన్‌కు విశాల్ చిక్కిన సన్నివేశం కావచ్చు. ఎందుకంటే, చుట్టూ చాలా మంది ఫైటర్లు ఉన్నారు.

ఒక పెద్దాయన.. బహుశా విలన్ అయి ఉండొచ్చు.. విశాల్‌ను గుండెలపై తన్నాడు. దీంతో విశాల్ వెనక్కి పడ్డారు. అదే సమయంలో ఒక బ్లాస్ట్ జరిగి ట్రక్కు గోడను బద్దలుకొట్టుకుని లోపలికి వచ్చింది. అయితే, ఆ ట్రక్కు ఆగకుండా కెమెరా వైపు దూసుకొచ్చింది. విశాల్ తిన్నగా పడుకొని ఉండటంతో తన వెనుక ఏం జరుగుతుందో తెలియలేదు. ట్రక్కు వేగంగా విశాల్ పక్కనుంచే దూసుకుపోయింది. ఆ సమయంలో విశాల్‌ను అక్కడున్నవారు పక్కకు లాగేశారు. ఒకవేళ ట్రక్కు కాస్త పక్కకు వచ్చి ఉంటే విశాల్ మీదు నుంచి వెళ్లిపోయేది. కాబట్టి పెను ప్రమాదమే తప్పింది. ఈ వీడియోను చూసిన అందరూ బాబోయ్ పెద్ద ప్రమాదమే తప్పిందని ఆశ్చర్యపోతున్నారు.

కాగా, ‘మార్క్ ఆంటొని’ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జే.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్, రీతూ వర్మ, అభినయ, నిళల్‌గల్ రవి, వై గీ మహేంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాను విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, గత చిత్రం ‘లాఠీ’ సినిమా షూటింగ్‌లోనూ విశాల్ గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయన కాలికి బలమైన గాయం అయ్యింది. కాలికి రక్తం కారుతున్నా సీన్ పూర్తిచేయాలనే సంకల్పంతో నొప్పిని బరిస్తూ నటించారు విశాల్.

Latest news
Related news