తారకరత్న తల్లిదండ్రులు మోహనకృష్ణ, సీత, చెల్లెలు రూపతో పాటు నందమూరి బాలకృష్ణ, వసుంధర, నందమూరి రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కళ్యాణ్ రామ్, ఆయన భార్య స్వాతి, తల్లి లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు చిన్న కర్మకు హాజరై తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అలాగే, సినీ ప్రముఖులు చాలా మంది ఈ చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, నటుడు అజయ్, దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత ఆదిశేషగిరి రావు, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు బెనర్జీ, తదితరులు హాజరై తారకరత్న ఫొటో వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు.
కన్నీరుమున్నీరు అయిన అలేఖ్య
తారకరత్న చిన్నకర్మ కార్యక్రమంలో ఆయన భార్య అలేఖ్యరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న అలేఖ్య.. ఆయన్ని తలుచుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. కంటతడి పెడుతోన్న తల్లిని పెద్ద కుమార్తె నిషిక ఓదార్చిన దృశ్యం చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చకమానవు. దుఃఖం ఆపుకోలేకపోతున్న అలేఖ్యను ఆమె కుటుంబ సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేశారు. భర్త చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ కూడా అలేఖ్య కన్నీరు పెట్టుకున్నారు.
ఇక ఈ కార్యక్రమంలోనూ బాబాయ్ బాలకృష్ణ కలివిడితనం కనిపించింది. అన్నయ్య మోహనకృష్ణకు తోడుగా అతిథులను ఆహ్వానించడంతో పాటు తారకరత్న కూతురు నిషికతోనూ, కుటుంబ సభ్యులతోనూ బాలకృష్ణ మాట్లాడుతూ కనిపించారు. ముఖ్యంగా బాలయ్య తాతయ్యకు నిషిక తన ఫోన్‌లో ఏదో చూపిస్తుండటం.. దాన్ని బాలకృష్ణ తీక్షణంగా చూస్తూ వివరాలు అడగడం ఆసక్తికరంగా అనిపించింది. బాలయ్య తాతయ్యతో తారకరత్న బిడ్డలకు ఎంత అనుబంధం ఉందో ఈ దృశ్యాలు మరోసారి రుజువు చేశాయి.
అలేఖ్యరెడ్డితో ప్రేమ పెళ్లి
ఎంపీ విజయసాయిరెడ్డికి చాలా దగ్గర బంధువైన అలేఖ్యరెడ్డిని 2012లో తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి తారకరత్న తండ్రి మోహనకృష్ణ, తల్లి సీతకు ఇష్టం లేదు. అందుకే, హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్‌లో స్నేహితుల సమక్షంలో తారకరత్న, అలేఖ్య పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదు. తారకరత్న, అలేఖ్య దంపతులకు మొదట ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరే నిషిక. ఆ తరవాత కొన్నాళ్లకు కవలలు పుట్టారు. బాబుకి తనయ్ రామ్ అని, పాపకు రేయ అని పేర్లు పెట్టారు తారకరత్న. పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే 39 ఏళ్ల వయసులో తారకరత్న వాళ్లను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.