Thursday, March 30, 2023

Pakistan కెప్టెన్సీ ఆఫర్‌ని అప్పట్లో తిరస్కరించిన షోయబ్ అక్తర్.. రీజన్ ఇదేనట

పాకిస్థాన్ (Pakistan) మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తరచూ వార్తల్లో ఉంటున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే అక్తర్.. తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు తరచూ ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాజీ స్పీడ్‌స్టర్.. 2022లోనే తనకి పాకిస్థాన్ కెప్టెన్సీ ఆఫర్ వచ్చిందని వెల్లడించాడు. అయితే.. కొన్ని కారణాలతో తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఇష్టపడలేదని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేశాడు.

1997లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన షోయబ్ అక్తర్.. కెరీర్ ఆరంభంలోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా కితాబు అందుకున్నాడు. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకి ఏకంగా 161.3కిమీ వేగంతో బంతిని విసిరిన అక్తర్.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ ఈ రికార్డ్‌ చెక్కు చెదరలేదు. అదే ఏడాది షోయబ్ అక్తర్‌ని పిలిచి మరీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కెప్టెన్సీ ఇవ్వబోయిందట. కానీ తాను తిరస్కరించినట్లు అక్తర్ చెప్పుకొచ్చాడు.

‘‘కెప్టెన్సీ ఆఫర్ చేసిన టైమ్‌లో నేను ఫిట్‌గా లేను. సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఉంటే నేను కేవలం మూడు మ్యాచ్‌లే ఆడేవాడిని. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు ఆడితే రెండేళ్లు మాత్రమే ఆటలో కొనసాగేవాడిని. మరోవైపు పీసీబీలో అప్పుడు చాలా అస్థిరత ఉండేది. బోర్డులో మేనేజ్‌మెంట్ సరిగా ఉండేది కాదు. దాంతో కెప్టెన్సీ వద్దనుకుని.. సహరులకి సపోర్ట్‌గా ఉన్నాను’’ అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

షోయబ్ అక్తర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నోసార్లు గాయాల బారిన పడ్డాడు. అయినప్పటికీ పాక్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లను షోయబ్ అక్తర్ ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 444 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పీసీబీ అధ్యక్ష పదవి కోసం షోయబ్ అక్తర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news