Tuesday, March 21, 2023

James Anderson | టెస్టు ర్యాంకింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. 87 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) మళ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల బే ఓవల్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టిన ఈ 40 ఏళ్ల పేసర్.. లేటు వయసులో టాప్‌లోకి దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ 866 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (864) కేవలం 2 పాయింట్ల వ్యత్యాసంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక గత నాలుగేళ్లుగా నెం.1 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 858 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.

2003లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటి వరకూ 178 టెస్టు మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో 682 వికెట్లు పడగొట్టిన ఈ వెటరన్ బౌలర్.. మూడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని చేరుకోగా.. ఏకంగా 32 సార్లు ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ముత్తయ్ మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708) టాప్-2లో ఉండగా.. ప్రస్తుతం మూడో స్థానంలో జేమ్స్ అండర్సన్ కొనసాగుతున్నాడు.

సుదీర్ఘ కెరీర్‌లో జేమ్స్ అండర్సన్ ఇలా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇది ఆరోసారి. 2018లో చివరిగా ఐదు నెలల పాటు టాప్ ర్యాంక్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్.. అదే ఏడాది దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాకి నెం.1 ర్యాంక్‌ని కోల్పోయాడు. అయితే.. ఎట్టకేలకి 40 ఏళ్ల 207 వయసులో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 87 ఏళ్ల రికార్డ్‌ని కూడా అండర్సన్ బ్రేక్ చేశాడు. 1936లో ఆస్ట్రేలియాకి చెందిన క్లారీ గ్రీమెట్ టాప్ ర్యాంక్‌లో ఉన్న ఓల్డెస్ట్ బౌలర్‌గా నిలవగా.. మళ్లీ ఇన్నాళ్లకి ఆ రికార్డ్‌ని అండర్సన్ బద్దలు కొట్టాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news