Friday, March 24, 2023

Suresh Babu దాతృత్వం.. ‘నారప్ప’ కలెక్షన్ల డబ్బు మొత్తం ఇచ్చేస్తాం!

Narappa re-release: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటించిన ‘నారప్ప’ (Narappa) సినిమా గత ఏడాది నేరుగా ఓటీటీలో రిలీజై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గత ఏడాది కరోనా టైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 13న థియేటర్లలోకి రాబోతోంది. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఒక్క రోజు మాత్రమే థియేటర్లలో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు ఈరోజు మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు (Producer Suresh Babu) అధికారికంగా ప్రకటించారు.

నారప్ప సినిమాని థియేటర్లలో చూడాలని ఉందంటూ చాలా మంది వెంకటేశ్ అభిమానులు గత కొన్నిరోజులుగా అడుగుతున్నారట. దాంతో.. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రదర్శిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’ని రిక్వెస్ట్ చేయగా.. వాళ్లు కూడా ఒప్పుకున్నారని వెల్లడించారు. గత కొన్ని రోజులు నుంచి చాలా మంది హీరోల బ్లాక్‌బాస్టర్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్ల గురించి ప్రస్తావనరాగా.. ‘నారప్ప’ మూవీని థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తాము తీసుకోమని సురేష్ బాబు స్పష్టం చేశారు. ఆ డబ్బు మొత్తాన్నీ ఛారిటీకి ఇచ్చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఏం సినిమాని రీరిలీజ్ చేయాలి? అనేదానిపై తొలుత తనకి క్లారిటీ రాలేదని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే.. అభిమానులు ఎక్కువగా నారప్పని డిమాండ్ చేయడంతో ఆ సినిమాకే మొగ్గు చూపినట్లు వివరించారు.

నారప్ప సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా ప్రియమణి నటించింది. అలానే రాజీవ్ కనకాల, కార్తీక్ రత్నం, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీలో వెంకటేశ్ నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఓటీటీలో నారప్ప మూవీ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు మంచి రేటింగ్‌‌ని కూడా సొంతం చేసుకుంది.

Read Tollywood Updates & Telugu News

Latest news
Related news