BRS Party Expansion in Andhrapradesh: బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొద్దిరోజుల కిందటే ప్రకటించారు కేసీఆర్. అనుకున్నట్లే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కూడా మార్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గులాబీ దళపతి.. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికే కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని చెప్పిన కేసీఆర్… ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచే పనిలో పడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రమైన… ఆంధ్రప్రదేశ్ లోనూ పాగ వేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫీస్ నిర్మాణ బాధ్యతలను తెలంగాణకు చెందిన ఓ మంత్రికి అప్పగించనున్నట్లు సమాచారం. సదరు మంత్రి త్వరలోనే ఏపీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్ ప్రకటించిన రోజే… ఏపీలోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. టపాసులు కూడా పేల్చి సంబరాలు కూడా చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మారుస్తూ ఈసీ పంపిన పత్రాలపై శుక్రవారం కేసీఆర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కుమారస్వామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనుకున్నట్లే కర్ణాటకలో పార్టీని విస్తరిస్తారా..? ఏపీపై కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నారా..? అనేది త్వరలోనే తేలనుంది.