Tuesday, October 3, 2023

BAN vs IND: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. విరాట్ కోహ్లి సెంచరీ.. భారత్ రికార్డ్ స్కోర్

ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగిన వేళ.. విరాట్ కోహ్లి సెంచరీతో సత్తా చాటిన వేళ.. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. తద్వారా వన్డేల్లో అత్యధికసార్లు 400కిపైగా పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. టీమిండియా వన్డేల్లో 400పైకిగా రన్స్ చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది.

ఛత్తోగ్రామ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా.. శిఖర్ ధావన్ (3), ఇషాన్ కిషన్ ఓపెనర్లు బరిలోకి దిగారు. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ మెల్లగా బ్యాటింగ్ మొదలుపెట్టి దూకుడు పెంచాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్ ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. 126 బంతుల్లోనే ద్విశతకం బాది.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్‌కు ఇది తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.

మరో ఎండ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న విరాట్ కోహ్లి.. దూకుడు పెంచాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్ 35.5 ఓవర్లలో జట్టు స్కోరు 305 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. ఎబాదత్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. 91 బంతుల్లో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి వన్డేల్లో ఇది 44వ శతకం కాగా.. ఓవరాల్‌గా 72వ సెంచరీ కావడం విశేషం.

వరుస బంతుల్లో రాహుల్, కోహ్లి ఔట్ కావడంతో భారత్ 41.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కోహ్లి ఔటైన తర్వాత వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్కోర్ బోర్డ్‌ను ముందుకు నడిపించారు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన తర్వాత అక్షర్ (17 బంతుల్లో 20) ఔటయ్యాడు. షకీబ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 37) ఔటయ్యాడు. అప్పటికే జట్టు స్కోర్ 400 దాటింది. చివరి ఓవర్లో శార్దుల్ ఠాకూర్ ఔట్ కాగా.. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. బంగ్లాదేేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్, షకీబ్ అల్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు.

Read More Sports News And Telugu News

Latest news
Related news