2017 నుంచి 2019 వరకు భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లయిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి వన్డేల్లో 43 సెంచరీలు బాదారు. ఆ మూడేళ్లలో ధావన్ 58 ఇన్నింగ్స్‌ల్లో 8 శతకాలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లి 65 ఇన్నింగ్స్ ఆడి 17 సెంచరీలు, రోహిత్ 67 ఇన్నింగ్స్ ఆడి 18 సెంచరీలు చేశారు. దీంతో వన్డేల్లో భారత్ గెలవడం తేలికైంది.
కానీ గత మూడేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2020 నుంచి 2022 మధ్య ధావన్, కోహ్లి, రోహిత్.. ముగ్గురూ కలిసి వన్డేల్లో 67 ఇన్నింగ్స్ ఆడి చేసింది ఒక్క సెంచరీనే. అది కూడా రోహిత్ చేసిందే. మిగతా ఇద్దరూ ఈ మూడేళ్లలో వన్డేల్లో ఒక్కటంటే ఒక్క శతకం కూడా నమోదు చేయలేదు. కోవిడ్ కారణంగా ఇంతకు ముందు ఆడినన్ని మ్యాచ్‌లు ఆడలేదనేది వాస్తవం. కానీ క్రికెటర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారనేది కూడా కాదనలేని నిజం.
కెప్టెన్సీ వివాదం, ఇంతకు ముందులా భారత్ ఒకే జట్టుతో బరిలోకి దిగకుండా.. రొటేషన్ పాలసీ అవలంభిస్తుండటం.. కోచ్‌కు కూడా విశ్రాంతి కల్పిస్తుండటం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ మూడేళ్లలో ముగ్గురు కలిసి భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు మునుపటిలా రాణించకపోవడం.. జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తోంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భారత టాప్ ఆర్డర్ వైఫల్యం మరింత స్పష్టంగా కనిపించింది. సెంచరీల సంగతి అటుంచితే.. హాఫ్ సెంచరీలకు కూడా దిక్కు లేకుండా పోయింది.
వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. ఈలోగా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఫామ్‌లో రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆటగాళ్లు పదే పదే గాయాల బారిన పడుతుండటం.. జట్టు కూర్పు విషయంలో సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలి. లేకపోతే టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరిస్థితే వన్డే వరల్డ్ కప్‌లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.
Read More Sports News And Telugu News