Monday, October 2, 2023

కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Sleeping With Socks On: శీతాకాలం.. రాత్రిపూట చలి తట్టుకోలేక చాలా మంది సాక్స్‌ వేసుకుని నిద్రపోతూ ఉంటారు. కాళ్ల పగుళ్ల సమస్య ఉన్నా కాళ్లకు సాక్స్‌ ధరించి పడుకుంటారు. నిద్రపోయేప్పుడు సాక్స్‌ వేసుకుంటే శరీరం వేడెక్కుతుందని, నిద్ర సరిగ్గా పట్టదని, మధ్యరాత్రిలో మెలకువ వస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ, ఇవన్నీ అపోహలే అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, రాత్రిపూట సాక్స్‌లు వేసుకుంటే.. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పనిచేస్తుందని చెబుతున్నారు. నిద్రపోయే సమయంలో కాళ్లకు సాక్సులు వేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. అవేంటే తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

రక్తప్రసరణ మెరుగవుతుంది..

కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక వెల్లడించింది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే.. అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. తద్వారా మన గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యానికి మేలు జురుగుతుంది.

త్వరగా నిద్రపడుతుంది..

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. బెడ్‌ మీద పడుకుని నిద్రరాక.. అటూఇటూ కదులుతూ ఉంటారు. ఇలాంటి వారు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBIలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సాక్స్ ధరించి నిద్రించే వారికి.. నిద్ర సమస్యలు తక్కువగా ఉంటాయి, అలాగే వాళ్లకు చాలా త్వరగా నిద్రపడుతుంది. సాక్స్‌ వేసుకుని నిద్రపోతే.. డిస్టల్‌ వాసోడైలేషన్ ప్రక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల చేతులు, కాళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కోర్‌ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నిద్రకు ఉపక్రమించిన వెంటనే… నిద్రలోకి జారుకుంటారు.

మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్‌ను నుంచి రిలీఫ్‌ ఉంటుంది..

మెనోపాజ్‌ సమయంలో.. చాలా మంది మహిళలను వేడి ఆవిర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రి సమయంలో మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. చాలా మంది సాక్స్‌ వేసుకని పడుకుంటే.. బాడీ టెంపరేచర్‌ పెరుగుతుందనే.. భావనలో ఉంటారు. కానీ, వెచ్చని పాదాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఇది శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది. మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

రేనాడ్స్ సిండ్రోమ్‌..

రేనాడ్స్ సిండ్రోమ్‌లో.. చలి కారణంగా చేతులు, పాదాల ధమనుల సంకోచం వల్ల తిమ్మిరిగా ఉంటాయి. కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే.. చలిని తట్టుకోవచ్చు, మరియు రేనాడ్స్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించవచ్చు.

పాదాల పగుళ్లకు చెక్‌..

శీతాకాలం చలి, చల్లని గాలి కారణంగా.. చర్మం పొడి బారి పాదల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి పాదాలకు నూనె లేదా మాయిచ్చరైజర్‌ అప్లై చేసి.. సాక్స్‌ వేసుకోండి. సాక్స్‌ తేమను నిలపడానికి సహాయపడతాయి. దీని వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • మీరు మరీ టైట్‌గా ఉండే సాక్స్‌లు వేసుకుంటే.. రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది.
  • సాక్స్‌లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మురికి సాక్స్‌లు వేసుకుంటే, ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది.
  • వదులుగా, శుభ్రంగా ఉండే సాక్స్‌లు మాత్రమే వేసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news