వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు రాణించిన తీరు దీనికి అద్దం పడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌లో పోరాడి గెలిచినప్పటికీ.. ఇతర జట్లతో జరిగిన వన్డేల్లోనూ ఇంతలా పోరాడాల్సిన అవసరం లేకుండా ఆ జట్టు విజయాలు సాధించింది.
రెండో వన్డేలోనూ భారత్ ఓడితే.. బంగ్లాదేశ్‌లో వరుసగా రెండో సిరీస్‌ను కోల్పోయినట్టు అవుతుంది. చివరిగా 2015లో పొరుగు దేశంలో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. అప్పుడు గెలవలేకపోయింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను ఎదుర్కొనే విషయంలో భారత్ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి. గతంలోనూ షకీబ్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టాడు. గత పర్యటనలో షకీబ్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి భారత బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. కానీ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఎక్కువ వికెట్లను పడగొట్టాడు. ఈసారి షకీబ్ భారత బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టడి చేయడంతోపాటు ఐదు వికెట్లు పడగొట్టాడు.
భారత్ విషయానికి వస్తే.. తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ బంతితో చక్కగా రాణించాడు. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసిన బౌలర్లు.. చివరి ఓవర్లలో అదే స్థాయిలో రాణించలేకపోయారు.
తొలి వన్డే జరిగిన ఢాకా వేదికగానే రెండో వన్డే కూడా జరగనుంది. దీంతో స్పిన్నర్లకు పిచ్ మరోసారి అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపొచ్చు. బంగ్లాదేశ్ జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ జట్టు అంచనా: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ షంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్ హొస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్ముద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎబాదత్ హొస్సేన్.
పక్కటెములకు బంతి తగలడంతో తొలి వన్డేకు దూరమైన అక్షర్ పటేల్ ఫిట్‌నెస్ సాధిస్తే.. షహబాజ్ అహ్మద్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. అక్షర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ విభాగం బలోపేతం అవుతుంది. తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ రెండో వన్డేలోనూ ఆడే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్‌లో ఇబ్బంది పడిన శార్దుల్ ఠాకూర్ ఇప్పుడు బాగానే ఉన్నాడని.. రెండో వన్డే ఆడే అవకాశం ఉందని శిఖర్ ధావన్ తెలిపాడు.
భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.