Thursday, March 30, 2023

ఈ యోగాసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. మైగ్రేన్‌ మాయం అవుతుంది..!

yoga poses for migraine relief: మైగ్రేన్‌ తలనొప్పి.. ఈ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది, ఇది ఎంత నరకంగా ఉంటుందో. మైగ్రేన్‌ తలనొప్పి వచ్చిందంటే ఆ బాధ భయంకరం. ఇది తలలో ఒకే వైపు నొప్పి వస్తుంది. ఒకసారి మైగ్రేన్‌ నొప్పి స్టార్ట్‌ అయితే.. 4 గంటల నుంచి 72 గంటల వరకూ కంటిన్యూ కావచ్చు. మైగ్రేన్‌లో కేవలం తలనొప్పే కాదు.. అలసట, కళ్లు తిరగటం, కళ్లు సరిగ్గా కనిపించకపోవటం, వికారం, వాంతితో పాటు వెలుతురు, చప్పుడు భరించలేకపోవటం వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాడీకణాలు ఎక్కువగా స్పందించడం వల్ల ఈ మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి, ఒంట్లో నీటిశాతం తగ్గటం, ఆల్కహాల్‌, పుల్లటి పండ్లు, ఛీజ్‌, నిద్రలేమి, ఎండ, వేడి, తేమ వాతావరణాలకు గురికావటం, పీరియడ్స్‌, లైట్‌ ఎక్కువగా ఉండటం, పొగ, పెద్ద శబ్దాలు, ఘాటన వాసనలు.. మైగ్రేన్‌ను ట్రిగ్గర్‌ చేస్తూ ఉంటాయి. మంచి ఆహారం, లైఫ్‌స్టైల్‌లో మార్పులు, ట్రిగ్గర్‌ చేసే అంశాలకు దూరంగా ఉంటే మైగ్రేన్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌ సమస్యను తగ్గించడానికి యోగా ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మైగ్రేన్‌తో బాధపడేవారు యోగా ప్రాక్టిస్‌ చేస్తే.. ఉపశమనం పొందవచ్చు. మైగ్రేన్‌ను తగ్గించే యోగాసనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మత్స్యాసనం..

మత్స్యాసనం వేయడానికి ముందుగా.. వెల్లకిలా పడుకోవాలి. రెండు అరచేతులూ చెవుల పక్కన ఆనించి తలనీ, భుజాల్నీ నేల నుంచి కొంచెం పైకి లేపి తల పై భాగాన్ని మాత్రమే కింద ఆనించాలి. చేతులను తొడల మీద పెట్టుకోవాలి. అలా కాళ్ల మీద పెట్టడం కష్టమనిపిస్తే రెండు చేతులనూ కింద ఆనించి ఉంచవచ్చు. ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలరో అంత సేపు ఉండి, చేతులను తీసి మళ్లీ భుజాలకూ చెవులకూ మధ్యన ఉంచాలి. మెల్లగా తలను యథాస్థితికి తీసుకురావాలి. ఇలా మూడుసార్లు చేయాలి.

పద్మాసనం..

మొదట రెండు కాళ్లు.. చాపి నేలపై ఉంచాలి. తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి. రెండు చేతులను మోకాళ్లపై నిటారుగా ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్లను ముందుకు చాపి ఉంచి చిన్ముద్ర ధ్యాన స్థితికి చేరుకోవాలి. ఆ ఆసనం వేస్తున్న సమయంలో భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి. ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేస్తే మంచి రిజల్ట్స్‌ వస్తాయి.

బాలాసనం..

బాలాసనం ప్రాక్టిస్‌ చేస్తే.. మైగ్రేన్‌ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాలాసనం వేయడానికి ముందుగా.. బోర్లా పడుకుని కుడి మోకాలు, కుడి చేతిని పక్కకు మడిచిపెట్టాలి. ఎడమ కాలు, ఎడమ చేయి కిందికి తిన్నగా ఉంచేసి సేద పడుకోవాలి. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు.. వెంటనే రెండు నిమిషాలు కుడివైపు, రెండు నిమిషాలు ఎడమవైపు ఈ పోజ్‌లో పడుకోండి.

శవాసనం..

మ్యాట్‌పై కాళ్లు, చేతులు చాపి వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని పూర్తి విశ్రాంత స్థితిలో ఉంచాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆలోచనలనూ మనసులోకి రానీయకుండా ఓ రెండు మూడు నిమిషాలు ఈ స్థితిలో ఉండండి. శవాసనం వేస్తే.. ప్రశాంతంగా నిద్రపడుతుంది. నిద్రలేమి కారణంగానూ.. మైగ్రెన్‌ సమస్య ట్రిగ్గర్‌ అయ్యే అవకాశం ఉంది.

మార్జారాసనం..

మార్జాలం అంటే పిల్లి. ఈ ఆసనం వేయడానికి రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లాపడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి. రెండు అరచేతులను నేల మీద ఉంచి మోకాళ్ల మీద లేవాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వీపును కిందకు వంచి తలను పెకైత్తాలి. తర్వాత శ్వాస వదులుతూ వీపును పైకి లేపుతూ తలను కిందికి వంచి నాభిని చూడాలి. ఇలా రోజూ పదిసార్లు చేసిన తర్వాత బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news