Friday, March 24, 2023

Oil Massage for kids: పిల్లలకు ఆయిల్‌ మసాజ్‌ చేస్తే.. మంచి రంగు వస్తారా..? – did oil massage can make baby fair

Oil Massage for kids: మన ఇళ్లల్లో చంటిపిల్లలలకు నూనెతో చక్కగా మర్దన చేస్తూ ఉంటారు. మన బామ్మలు, అమ్మమ్మల కాలం నుంచి ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. ఆయిల్‌ మసాజ్‌ బిడ్డకు చక్కని విశ్రాంతిని అందిస్తుంది. తల్లికి, బిడ్డకు చక్కని అనుబంధం బలపడటానికి ఇది చక్కటి మార్గం. బిడ్డతో అనుబంధం బలపడటానికి, చిన్నారి మెదడు, భావోద్వేగాల అభివృద్ధికి.. తరచూ తల్లిదండ్రుల స్పర్శ అవసరమని నిపుణులు అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డకు ఆయిల్‌ మసాజ్‌ చేస్తే.. మంచి రంగు వస్తారనే భావనలో ఉంటారు. చర్మం కాంతివంతంగా ఉంటుందని కూడా నమ్ముతారు. అసలు దీనిలో ఎంత నిజం ఉంది. పిల్లలకు మసాజ్‌ చేస్తే నిజంగా రంగు పెరుగుతారా..? పిల్లలకు ఆయిల్‌ మసాజ్‌ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

డాక్టర్‌ ఏమి చెబుతున్నారు..?

చంటి పిల్లలకు నూనెతో మసాజ్‌ చేయడం వల్ల.. వారి రంగులో ఎలాంటి మార్పు ఉండదని డాక్టర్‌ స్వాతి సేథ్ అన్నారు. పిల్లలు తెల్లగా ఉన్నా, చామన ఛాయలో ఉన్నా, నల్లగా ఉన్నా.. వారి జీన్స్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మసాజ్ ఆయిల్, క్రీమ్ బేబీ స్కిన్ ఫెయిర్‌గా మార్చలేవమని డా. స్వాతి సేథ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ బిడ్డ రంగును మార్చడానికి తల్లిదండ్రులు, వారికి మసాజ్‌ చేస్తుంటే అది మానుకోవాలని సూచించారు. చింటి పిల్లల చర్మం రంగు, ఆకృతి అనేక మార్పులకు లోనవుతుందని, వారి అసలు రంగుకు తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చని డాక్టర్‌ స్వాతి సేథ్ చెప్పారు. పుట్టిన వెంటనే పిల్లల రంగును నిర్ణయించలేమని, నెలలు పెరిగే కొద్ది వారి రంగు మారుతూ వస్తుందని చెప్పారు.

మసాజ్‌ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి..

చంటి పిల్లలకు మసాజ్‌ చేస్తే.. వారు, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని. ఏషియన్ నర్సింగ్ రీసెర్చ్ జర్నల్ ప్రకారం, బేబీ మసాజ్ శిశువు మానసిక సామాజిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది, తల్లి బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది.

మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రకారం, చంటి పిల్లలకు మసాజ్‌ చేస్తే.. వారు బరువు పెరగడానికి, అభివృద్ధికి సహాయపడుతుంది. ఆయిల్‌ మసాజ్‌ చేస్తే వారు ప్రశాంతంగా నిద్రపోతారు. అస్తమానూ ఏడ్చే పిల్లలను ఊరుకోబెట్టడానికీ.. మసాజ్‌ సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్లు సోకవు..

మసాజ్‌ సరైన రీతిలో చేస్తే.. బిడ్డ బరువు పెరగడం మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్‌లను కూడా నివారిస్తుందని, శిశు మరణాలను 50శాతం వరకు తగ్గిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టేందుకు ప్రభావవంతమైన నిరోధకంగా పని చేయడంలో మైక్రోబయోమ్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయోమ్ వృద్ధి చెందినట్లు కనుగొన్నారు. నూనెతో మసాజ్ చేయడం ద్వారా శరీరం గట్టిపడి సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వ్యాపించి రక్తంలోకి చేరడాన్ని కష్టతరం చేసి ప్రాణాపాయ రోగాలు రాకుండా కాపాడుతుంది.

మోటార్ స్కిల్స్‌ పెరుగుతాయి..

ఆయిల్‌ మసాజ్‌ చేస్తే.. పిల్లలలో ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది, ఇది పిల్లలకి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆయిల్‌ మర్దన.. మసాజ్‌ చేసేవారు, బిడ్డలోనూ.. ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. మసాజ్ చేయడం వల్ల పిల్లలలో మోటార్ నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news