Tuesday, March 21, 2023

Natural Oils For Skincare: ఈ నూనె మీ మూఖానికి రాస్తే.. అందం రెట్టింపు అవుతుంది..! – these facial oils will increase your beauty and nourish your skin

Natural Oils For Skincare: ముఖానికి ఆయిల్‌ రాయాలంటే.. చాలా మంది సందేహపడుతూ ఉంటారు. నూనె రాస్తే ముఖం జిడ్డుగా మారుతుంది, నల్లగా అవుతుందని, చర్మ సమస్యలు ఎక్కువవుతాయనే అపోహలు చాలా మందికి ఉంటాయి. కానీ, మీ చర్మాన్ని రక్షించడానికి, అందాన్ని రెట్టింపు చేయడానికి, మీ ఏజింగ్‌ ప్రక్రియను తగ్గించడానికి నూనెలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి చర్మానికి పోషణ అందించి లోలోపలి నుంచి చర్మానికి మెరుపును అందిస్తాయి. చర్మం నుంచి సహజంగానే నూనెలు ఉత్పత్తి అవుతాయి. చర్మం తరచుగా నీటిని కోల్పోతుంటుంది. దీంతో నిర్జీవంగా తయారవుతుంది. మనం రాసే నూనెలు ఆ తేమను బంధించి ఉంచడానికి సాయపడతాయి. మీ అందాన్ని సంరక్షించే.. న్యాచురల్‌ ఆయిల్స్‌ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..

మునగ నూనె..

మునక్కాయల్లో ఉండే గింజలను ఎండబెట్టి, వాటి నుంచి తీసిన నూనే ఈ మునగ నూనె. మునగ నూనె చర్మానికి రాసుకోవడం వల్ల తేమ అందడంతో పాటు కాలుష్యం వల్ల పాడైన చర్మం పూర్వ స్థితికి వస్తుంది. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్.. చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయి. శీతాకాలం మునగ నూనె ముఖానికి రాసుకుంటే మంచిది. మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం యంగ్‌గా ఉండేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ ‘సి’ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. మునగ నూనెలో విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు ఈ నూనె ముఖానికి రాసుకోవచ్చు.

వేప నునె..

వేప నూనెను కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. రాత్రిపూట మీ ముఖానికి ఈ నూనె అప్లై చేసుకుని నిద్రపోవచ్చు.

బాదం నూనె..

ఈ నూనెలో చర్మానికి సాయపడే విటమిన్‌ ఇ, జింక్‌, ప్రొటీన్లు, పొటాషియం ఉంటాయి. బాదం నూనె న్యాచురల్‌ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని నార్మల్‌ చేస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడేవారు.. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. బాదం నూనెలోని పోషకాలు యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా మాయమవుతాయి.

ఆలివ్‌ ఆయిల్‌..

ఈ నూనెలో ఉండే ఫ్యాటీ లిపిడ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మొటిమలకు కారణమయ్యే సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ముడతలూ, గీతలను తొలగిస్తాయి. నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎ చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

అవిసె గింజల నూనె..

అవిసె గింజల నూనె చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. వారంలో కనీసం రెండు సార్లైనా అవిసె నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేస్తే.. వాపు, ఎరుపు వంటి ఇబ్బందులు తగ్గుతాయి. చర్మానికి తేమ అందించి తాజాగా మెరిసిపోయేలా చేస్తుంది. రోజూ రాత్రి పూట కొద్దిగా అవిసెనూనెను కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, చర్మం మీద మచ్చలు ఉన్న చోట రాయండి. ఇలా చేస్తే సమస్య దూరం అవుతుంది.

చందనం నూనె..

చందనం నూనె మీ అందాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. మీ ముఖానికి చందనం నూనె అప్లై చేస్తే.. ముఖంపై ఏర్పడిన ముడతలు, గీతలు తొలగుతాయి. చందనంలో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news