Sunday, April 2, 2023

సూర్య బ్యాట్‌తో బంగ్లాపై బరిలోకి దిగిన రోహిత్ శర్మ

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో బరిలోకి దిగాడు. రోహిత్ చేతిలో ఉన్న బ్యాట్ అంచుపై ఎస్కే యాదవ్ అనే అక్షరాలు కనిపించాయి. రోహిత్, సూర్య మధ్య ఎంతో కాలంగా అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ముంబై జట్టు తరఫున క్రికెట్ ఆడారు. ఐపీఎల్‌లో రోహిత్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టులో కీలక ఆటగాడు. సూర్య భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని 12 ఏళ్ల క్రితమే రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

సూర్య, రోహిత్‌లకు వేర్వేరు స్పాన్సర్లు ఉన్నారు. సియాట్ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌‌తో రోహిత్ కనిపించగా.. ఆ బ్యాట్ అంచున ఎస్కే యాదవ్ అనే అక్షరాలు ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రోహిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కనిపించాయి.

తొలి వన్డేలో 4 ఫోర్లు, ఓ సిక్స్ బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్.. 31 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యాక.. అదే ఓవర్లో విరాట్ కోహ్లి పెవిలియన్ చేరగా.. భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో టీమిండియా గెలుస్తుందనిపించింది. కానీ ఆఖరి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాను గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఢాకా వేదికగానే బుధవారం జరగనుంది.

సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి చివరిసారిగా టీ20 వరల్డ్ కప్‌లోనే ఆడారు. ఆ తర్వాత రోహిత్, కోహ్లి ఇండియాకు వచ్చేయగా.. సూర్య న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో భాగంగా ఉన్నాడు. న్యూజిలాండ్ పర్యటన నుంచి సూర్య ఇండియాకు వచ్చేయగా.. భారత్ నుంచి రోహిత్ బంగ్లా పర్యటనకు వెళ్లాడు. కాబట్టి టీ20 వరల్డ్ కప్ సమయంలోనే సూర్య బ్యాట్‌ను రోహిత్ తీసుకొని ఉండే అవకాశం ఉంది.

Read More Sports News And Telugu News

Latest news
Related news