Sunday, April 2, 2023

ఉత్కంఠ మ్యాచ్‌లో బంగ్లా విజయం.. చివర్లో వణికించిన రోహిత్ శర్మ

చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. గాయం కారణంగా డగౌట్‌కే పరిమితమైన టీమిండియా సారథి రోహిత్ శర్మ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆశలు రేపినా, చివరి ఓవర్‌కు 20 పరుగులు రావాల్సిన స్థితిలో భారత్‌కు 14 పరుగులే వచ్చాయి. భారత్ ఈ ఓటమితో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. బంతితో, బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన బంగ్లా జట్టు.. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు.. 19 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా పుంజుకొని 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. తొలి వన్డేలో భారత్‌కు విజయాన్ని దూరం చేసిన మెహిదీ హసన్ మిరాజ్ (100 పరుగులు, 83 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్సులు) మరోసారి రాణించి ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. బ్యాట్‌తో, బంతితో (2 వికెట్లు) రాణించిన మిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

బంగ్లా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఎబాడట్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 5 (6 బంతుల్లో, 1 ఫోర్) పరుగులకే ఔటయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (8 పరుగులు, 10 బంతుల్లో, 1 ఫోర్) మెహిదీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (82 పరుగులు, 102 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సులు), అక్షర్ పటేల్ (56 పరుగులు, 56 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సులు) భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. బంగ్లాదేశ్ మరోసారి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. బౌలింగ్‌ ఛేంజ్ చేయడంతో అటాకింగ్‌కు వచ్చిన ఎబాడట్‌.. భారీ షాట్లతో ఊపుమీదున్న అక్షర్‌ పటేల్ (56)ను ఔట్ చేశాడు. షాట్ ఆడే ప్రయత్నంలో షకిబ్ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు అక్షర్.

ఆ తర్వాత గాయం కారణంగా డగౌట్‌కు పరిమితమైన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌‌కు వచ్చాడు. అక్షర్ పటేల్ ఔటైన తర్వాత ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ సిక్సర్లతో బంగ్లా శిబిరంలో వణుకు పుట్టించాడు. చివర్లో టెయిలెండర్ బ్యాట్స్‌మన్ల నుంచి రోహిత్‌కు సరైన సహకారం లభించకపోవడంతో బంగ్లాను విజయం వరించింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు (3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు.

96/6 నుంచి 271/7
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆదిలోనే టాప్ ఆర్డర్ వికెట్లన్నీ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి స్థితిలో మెహిదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా.. ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. ఫలితంగా 19 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా పుంజుకొని నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

ముఖ్యంగా మెహిదీ హసన్ మిరాజ్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపం మార్చేశాడు. 83 బంతుల్లోనే సెంచరీ (100) చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మహ్మదుల్లా అతడికి చక్కని సహకారం అందించాడు. 96 బంతుల్లో 77 (7 ఫోర్లు) పరుగులు చేశాడు. వీరిద్దరు నెలకొల్పిన భాగస్వామ్యం.. భారత్‌పై బంగ్లాదేశ్‌‌కు ఏ వికెట్‌కైనా అత్యుత్తమం.

ఆరంభంలో భారత పేసర్లు నిప్పులు కురిసే బంతులతో బంగ్లా బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టినా.. ఎప్పట్లాగే కీలక సమయంలో చేతులెత్తేశారు. ఫలితంగా 100 పరుగులే కష్టమని భావించిన మ్యాచ్‌లో.. బంగ్లా జట్టు ఏకంగా 271 పరుగులు చేసింది. చివర్లో నసుమ్‌ అహ్మద్ (18* పరుగులు, 11 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్స్) కాసేపు బ్యాట్ ఝళిపించడంతో బంగ్లా గౌరవప్రదమైన స్కోరు చేసంది.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా బౌలర్లలో ఎబాడట్ 3 వికెట్లు తీయగా.. మెహిదీ హసన్ మిరాజ్ 2, షకీబుల్ హసన్ 2, ముస్తాఫిజుర్ 1, మహ్మదుల్లా 1 వికెట్ తీశారు.

IND vs BAN: రోహిత్ శర్మకు గాయం.. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి
ప్రచార రథంతో పవన్ కళ్యాణ్.. వాహనం పేరుకు అర్థమిదే

Latest news
Related news