Friday, March 24, 2023

Teja: దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’.. డైరెక్టర్ తేజ పాత ఫార్ములా రిపీట్ చేస్తున్నారా?

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలను అందుకున్నారు డైరెక్టర్ తేజ (Teja). ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే విపరీతంగా పాపులారిటీ సంపాదించారు. అంతేకాదు, ఉదయ్ కిరణ్ లాంటి లవర్ బాయ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ‘చిత్రం’ తరవాత ‘నువ్వు నేను’, ‘జయం’, ‘నిజం’ లాంటి సినిమాలతో తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఉదయ్ కిరణ్, రిమాసేన్, నితిన్, కాజల్ వంటి ఎంతో మంది హీరోహీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు మరో హీరోను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అహింస’. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు శ్రోతలను అలరించాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ సోమవారం కొత్త పోస్టర్లను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్లలో అభిరామ్ యాక్షన్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Ahimsa

‘అహింస కొత్త పోస్టర్లు’

ఒక పోస్టర్‌లో అడవిలో ప్రత్యర్థితో అభిరామ్ బురదలో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. పక్కనే హీరోయిన్ కూడా ఉంది. మరో పోస్టర్‌లో బురదలో బాగా ఫైట్ చేసిన తరవాత ఒక కర్ర పట్టుకుని ప్రత్యర్థిపై దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా అభిరామ్ కనిపిస్తున్నారు. ఈ రెండు పోస్టర్లు చూస్తుంటే తేజ పాత సినిమాల్లోని హీరోలు గుర్తుకొస్తున్నారు. ‘జయం’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాల్లో హీరోలు ఇలాగే ప్రతినాయకుడిపై ఫైట్ చేశారు. అంటే, మళ్లీ తేజ పాత ఫార్ములాను రిపీట్ చేస్తున్నారా అనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల మాటలు రాశారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలోని పాటలన్నింటినీ చంద్రబోస్ రాశారు. బీవీ రమణ యాక్షన్ డైరెక్టర్ కాగా.. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అభిరామ్ సరసన గీతికా తివారీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.

Latest news
Related news