Thursday, March 30, 2023

Ravi Teja: కారు కొన్న రవితేజ అసిస్టెంట్ శ్రీను.. అంతా నీ వల్లే మై డియర్ మాస్ గాడ్

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రవితేజ. ఆయన ఎదగడంతో పాటు తనను నమ్ముకున్నవాళ్ల ఎదుగుదలను కూడా కోరుకుంటారాయన. కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చిన వ్యక్తి కాబట్టి కష్టపడేవాళ్లను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. అలా రవితేజ ప్రోత్సహించిన వ్యక్తి శ్రీనివాస్ రాజు.

మాస్ మహారాజా దగ్గర చాలా కాలంగా పర్సనల్ అసిస్టెంట్‌గా, మేనేజర్‌గా శ్రీనివాస్ రాజు పనిచేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ శ్రీనివాస్ రాజు ఎక్కడో ఒక చోట చిన్న పాత్రలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. రవితేజ ఎక్కడికి వెళ్లినా పక్కనే శ్రీనివాస్ రాజు కనిపిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే రవితేజ షాడో శ్రీను. అంతలా శ్రీనును రవితేజ నమ్మారు. ఆయన కూడా అంత నమ్మకంగా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా శ్రీనివాస్ రాజు కారు కొనుగోలు చేశారు. టాటా హారియర్ ఎస్‌యూవీని శ్రీను కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే, ట్వీట్‌లో ఒక వీడియోను కూడా పొందుపరిచారు. ఈ వీడియోలో రవితేజ కూడా ఉన్నారు. తన కొత్త కారును రవితేజ వద్దకు తీసుకెళ్లిన శ్రీను.. ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తన హీరోతోనే కారు నడిపించారు. ఈ ఆనందాన్ని, రవితేజపై తనకున్న భక్తిని ట్వీట్‌లో వెల్లడించారు శ్రీను.

‘‘నా గ్రామంలో సైకిల్ తొక్కుకునే దగ్గర నుంచి సొంతంగా కారు కొనుక్కునే స్థాయికి వచ్చాను. ఇదంతా మీ వల్లే సాధ్యపడింది. మీతో కలిసి నేను ఎన్నో మైళ్లు ప్రయాణించి ఉండొచ్చు.. కానీ, మీరు కారు నడుపుతుంటే కొన్ని కిలోమీటర్ల దూరం మీ పక్కనే కూర్చోవడం వాటిన్నింటికంటే గొప్ప. నా ప్రతి అడుగులో మీరు ఉన్నందుకు థాంక్యూ డియర్ మాస్ గాడ్. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితం మీకు అంకితం’’ అని రవితేజను ఉద్దేశించి శ్రీను ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో శ్రీనుకి రవితేజ అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

శ్రీనివాస్ రాజు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన శ్రీనివాస్ రాజు కుమార్తెల ఓణీ వేడుకలో రవితేజ పాల్గొన్నారు. అక్కచెల్లెళ్లు అనన్య, నిత్యలను రవితేజ ఆశీర్వాదించారు. వారితో ఫొటోలు దిగారు. ఈ ఫంక్షన్‌లో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, యంగ్ హీరో తేజ సజ్జా, నటుడు బ్రహ్మాజీ, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ ఇలా చాలా మంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ ఫంక్షన్‌కు హాజరై అనన్య, నిత్యలకు ఆశీర్వాదాలు అందించారు.

Ravi Teja

శ్రీను కుమార్తెల ఓణీల ఫంక్షన్‌లో రవితేజ

Latest news
Related news