Tuesday, October 3, 2023

బెడిసికొడుతున్న బీసీసీఐ పెద్దల నిర్ణయాలు.. టీమిండియా కొంప ముంచుతున్న అతి ప్రయోగాలు!

టీమిండియా.. ప్రపంచ క్రికెట్లోని శక్తివంతమైన జట్లలో ఒకటి. ఈ భూమ్మీద ఏ క్రికెట్ బోర్డుకు లేనన్ని ఆర్థిక వనరులు బీసీసీఐ సొంతం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. క్రికెట్‌ను మతంలా భావించే గడ్డ మీద ఆటగాళ్లకు కొరత లేదు. ఏక కాలంలో మన దేశం తరఫున మూడు జట్లను ఆడించినా సరే.. ప్రపంచంలోని బలమైన జట్లను సైతం ఓడించగల సత్తా మాకుంది అని గతంలో హార్దిక్ పాండ్య చెప్పిన మాట అక్షరాలా నిజం. కానీ కాంబినేషన్ల కోసం చేస్తున్న అతి ప్రయోగాలు.. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జరుగుతున్న తప్పిదాలు టీమిండియా కొంప ముంచుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌, వన్డే సిరీస్‌ల్లో ఓడటంతో మొదలైన భారత క్రికెట్ జట్టు ఓటముల పరంపర.. బంగ్లాతో తొలి వన్డేలో ఓటమి వరకూ కొనసాగింది. అలాగనీ టీమిండియా సిరీస్‌లు గెలవలేదా అంటే..? గెలిచింది. కానీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి వీరోచిత పోరాటంతో గెలవడం మినహా అభిమానులకు సంతృప్తినిచ్చే విజయాలేవీ పెద్దగా లేవు.
ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు కోవిడ్ కారణంగా వాయిదా పడటంతో.. ఈ ఏడాది నిర్వహించగా.. అప్పటి వరకూ సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి టెస్టులో ఓడి సిరీస్‌ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.

ఇక ఆసియా కప్‌లో వైఫల్యం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. టీ20 వరల్డ్ కప్‌లోనైనా రాణిస్తారనుకుంటే సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు బంగ్లా చేతిలో ఓటమి అయితే పెద్ద భంగపాటు.
రొటేషన్ పాలసీలో భాగంగా బీసీసీఐ ఈ ఏడాది పదే పదే ఆటగాళ్లను మార్చింది. కెప్టెన్లను కూడా ఎన్నడూ లేని విధంగా మార్చింది. ఏ సిరీస్‌కు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారో..? ఏ మ్యాచ్‌లో ఎవర్ని ఆడిస్తారో చెప్పలేని పరిస్థితి. టీ20 వరల్డ్ కప్ కోసం దినేశ్ కార్తీక్‌ను ఏడాదికిపైగా ఫినిషర్‌గా తీర్చిదిద్ది అతణ్ని సరిగా వాడుకోవడంలో మేనేజ్‌మెంట్ విఫలమైంది.

గాయం నుంచి కోలుకోగానే కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నీకి ఎంపిక చేశారు. అతడు కుదురుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. రెగ్యులర్ ఓపెనర్లిద్దరూ ఈ మ్యాచ్‌లో బాగా ఆడారు.. అని చెప్పుకోవడానికి ఈ ఏడాది ఏ మ్యాచ్ అయినా ఉందేమో అని గూగుల్లో గాలించినా దొరకని పరిస్థితి. బుమ్రాను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం.. తర్వాత తూచ్ ఫిట్‌నెస్ పూర్తిగా లేదని తప్పించడం చూస్తుంటే.. ఎక్కడో స్పష్టత లోపించిందనే భావన కలుగుతోంది. ఆసియా కప్ సమయంలో జడేజా లాంటి కీలక ఆటగాడు వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ గాయపడటం ఏంటో కూడా బీసీసీఐ పెద్దలకే తెలియాలి.

ఇక రిషబ్ పంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో అతడంత ట్రోలింగ్‌కు గురైన ఆటగాడు మరొకరు ఉండరేమో. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కప్ అందించిన హార్దిక్ పాండ్యకు.. ప్రయోగాత్మకంగా టీ20ల్లో కెప్టె్న్సీ అవకాశం ఇస్తే.. అతడు నిరూపించుకున్నాడు. దీంతో పాండ్యను పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ అనుకుంటోంది. మరి అదే ఐపీఎల్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపిన సంజూ శాంసన్‌కు మాత్రం ఆడే అవకాశం ఇవ్వడమే గగనమైపోతోంది. సంజూ పట్ల ఇంత వివక్ష ఎందుకు అని ఇటీవలి కాలంలో ట్విట్టర్లో నెటిజన్లు పోస్టు చేయని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
బంగ్లాతో వన్డే సిరీస్‌కు ముందు రోజు మహ్మద్ షమీ గాయపడితే.. వెంటనే అతడికి రీప్లేస్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ విషయంలో మాత్రం రీప్లే్స్‌మెంట్‌ను ప్రకటించలేదు. మెడికల్ టీం సూచనల ప్రకారం పంత్‌ను వన్డే సిరీస్ నుంచి రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటన చేసిన బోర్డు.. అతడికి ఏమైందనే విషయం మాత్రం చెప్పదు. అటు కెప్టెన్ గానీ.. వైస్ కెప్టెన్ గానీ, హెడ్ కోచ్ గానీ పంత్‌కు ఏమైందనే విషయంలో క్లారిటీ ఇవ్వరు. అసలు వారికైనా క్లారిటీ ఉందా? అనే ప్రశ్న సగటు అభిమానికి తలెత్తడం పెద్ద వింతేం కాదు.

బంగ్లాతో తొలి వన్డేలో నలుగురు ఆల్‌రౌండర్లను ఆడిస్తున్నామని రోహిత్ శర్మ గొప్పగా చెప్పుకున్నాడు. ఆ ఆల్‌రౌండర్లు ఎవరయ్యా అంటే వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్. వీళ్లలో సుందర్ మాత్రమే ఫర్వాలేదనిపించగా.. ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా ఇద్దరూ డకౌటయ్యారు. ఈ ఆల్‌రౌండర్లలో సుందర్ మినహా మిగతావాళ్లు బ్యాటింగ్ చేయగల టెయిలెండర్లు అంతేగానీ నిఖాస్సయిన ఆల్‌రౌండర్లు కాదు. చాహర్ పవర్ ప్లే బౌలర్ మాత్రమే. ఆల్‌రౌండర్లను తయారు చేసుకోవడం అంత తేలికైన పని కాదు కదా.. దానికి దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. కానీ ఇన్‌స్టంట్‌గా ఆల్‌రౌండర్లను ఎలా తయారు చేయగలం..? సచిన్, యువీ, సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు బౌలింగ్ చేసేవారు.. ఇప్పుడు అలాంటి ఆటగాళ్లు జట్టులో లేరంటే.. తప్పు ఎవరిది?
ఈ సందర్బంగా ప్రస్తావించదగ్గ అంశం ఏంటంటే.. 2006లో పాకిస్థాన్‌పై భారత్ 404/0తో ఉన్న స్కోర్ కార్డ్‌ను షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. స్కోర్ బోర్డును మర్చిపోండి.. ఈ 11 మంది ఆటగాళ్ల విషయంలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అదేంటో చెప్పండి అని ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా ప్రశ్నించాడు. దానికి చాలా మంది నెటిజన్లు ఇచ్చిన సమాధానం ఏంటంటే.. పదకొండు మంది ఆటగాళ్లలో ప్రతి ఒక్కరూ టెస్టుల్లో కనీసం ఒక సెంచరీ చేశారని. వీరూ ప్రశ్నకు ఇదే సరైన సమాధానం కావొచ్చేమో గానీ.. ఆ జట్టులోని ధోనీ, లక్ష్మణ్, ద్రావిడ్ మినహా మిగతా ఆటగాళ్లంతా బౌలింగ్ చేయగలరు. మరి అలాంటి జట్టును ఇప్పుడెందుకు తయారు చేసుకోలేకపోతున్నాం.?

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు పదే పదే విఫలమవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. సిరీస్ సిరీస్‌‌కు ఆటగాళ్లను, కెప్టెన్లను మార్చేయడం లాంటి ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. కోర్ టీమ్‌ విషయంలో ఓ అంచనాకు వచ్చి.. వారికి బ్యాకప్‌గా సరైన స్థానంలో సరైన ఆటగాడిని ఆడించే దిశగా మేనేజ్‌మెంట్ ఎందుకు ఆలోచించలేకపోతుందో సగటు అభిమానికి అర్థం కావడం లేదు.

Read More Sports News And Telugu News

Latest news
Related news