Friday, March 31, 2023

టెస్టుల్లో అడుగుపెట్టడం కోసం.. సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం..!

టీ20ల్లో టీమిండియా తరఫున కీలక బ్యాటర్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలిచ్చిన సూర్య.. లాంగ్ ఫార్మాట్లో ఆడేందుకు తనను తాను సిద్ధం చేసుకోవడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని డిసైడయ్యాడు. హైదరాబాద్‌తో ముంబై ఆడనున్న రెండో మ్యాచ్‌లో సూర్య ఆడనున్నాడు.

రెండు నెలలపాటు విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడిన సూర్య.. టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ పర్యటన తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇవ్వడంతో.. ప్రస్తుతం సూర్య ఇంట్లోనే ఉంటున్నాడు. అజింక్య రహానే సారథ్యంలో ముంబై జట్టు రంజీ ట్రోఫీ ఆడనుండగా.. సూర్య సైతం దేశవాళీ ట్రోఫీలో ఆడనున్నాడు.

ఈ ఏడాది టీ20ల్లో సూర్య అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2022లో 31 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య 46.56 యావరేజ్‌తో 1164 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు అతడే.

టీ20ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సూర్య.. వన్డేల్లో మాత్రం అదే తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. 2022లో 13 వన్డేలు ఆడిన స్కై.. 26 యావరేజ్‌తో 260 రన్స్ చేశాడు. కేవలం ఒక హాఫ్ సెంచరీ చేశాడు.

సూర్యకుమార్ యాదవ్‌కు ఫస్ట్ క్లాస్‌లో అద్భుతమైన రికార్డ్ ఉంది. 77 మ్యాచ్‌లు, 129 ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. 44.01 సగటుతో 5326 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 200.

రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో ముంబై ఆంధ్రప్రదేశ్‌‌తో తలపడనుంది. ముంబై తరఫున పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, తుషార్ దేశ్‌పాండే తదితరులు బరిలోకి దిగనున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌తోపాటు అతడి సోదరుడు ముషీర్ ఖాన్ సైతం రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు.

విజయ్ హజారే ట్రోఫీ సమయంలో గాయాల బారిన పడిన బౌలర్ ధవల్ కులకర్ణి, ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఇంకా కోలుకోలేదు. దీంతో వారిని రంజీ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. మోహిత్ అవస్థి, రాయస్టన్, దియాస్‌లతో కూడిన ముంబై పేస్ విభాగాన్ని దేశ్‌పాండే ముందుకు నడపనున్నాడు.

డిసెంబర్ 13న హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో రంజీ ట్రోఫీ సీజన్ 2022-23 ప్రారంభం కానుంది.

Read More Sports News And Telugu News

Latest news
Related news