Monday, October 2, 2023

Litton Das: భారత్‌ను భయపెట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్‌కు జాక్‌పాట్!

లిట్టన్ దాస్.. ఈ పేరు గుర్తుంది కదా..! టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ దశలో ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ 27 బంతుల్లో 60 పరుగులు చేసి.. ఒంటి చేత్తో టీమిండియాను ఓడించినంత పని చేశాడు. ఈ క్రికెటర్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అద్భుత అవకాశం ఇచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయపడటంతో.. అతడి స్థానంలో లిట్టన్ దాస్‌ను మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించింది. లిట్టన్ దాస్‌కు గతంలో టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2021లో న్యూజిలాండ్ పర్యటన సమయంలో మహ్ముదుల్లా గాయపడటంతో ఓ మ్యాచ్‌కు దాస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్లలో ఒకడైన లిట్టన్ దాస్ ఆ క్రికెట్ జట్టు లీడర్‌షిప్ గ్రూప్‌లో భాగం. షకీబ్ అల్ హసన్‌కు టెస్టు కెప్టెన్సీ అప్పగించాక.. లిట్టన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ‘భారత్‌తో కీలక సిరీస్‌కు తమీమ్ ఇక్బాల్ లాంటి కెప్టెన్ దూరం కావడం బాధాకరం. గత కొన్నేళ్లుగా అతడి నాయకత్వంలో బంగ్లా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. కానీ లిట్టన్ దాస్‌కు ఎంతో అనుభవం ఉంది. అతడు తన నాయకత్వ లక్షణాలను కూడా ప్రదర్శించాడు’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు.

తమీమ్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో.. షకీబ్ అల్ హసన్‌కు కెప్టెన్సీ అప్పగించాలని భావించగా.. అతడు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో బోర్డు లిట్టన్ కుమార్ దాస్ వైపు మొగ్గు చూపిందట. బంగ్లాదేశ్‌ తరఫున కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న తొలి హిందూ క్రికెటర్ లిట్టన్ దాస్ కావడం గమనార్హం.

భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే మరికాసేపట్లో (ఆదివారం ఉదయం 11.30 గంటలకు) ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 7న రెండో వన్డే, 10న మూడో వన్డే జరగనుంది. తొలి రెండు వన్డేలు ఢాకా వేదికగా జరగనుండగా.. మూడో వన్డే ఛత్తో‌గ్రామ్ వేదికగా జరగనుంది.

Read Also: బంగ్లా జట్టులో శ్రీకృష్ణుడి సేవకుడు.. లిట్టన్ దాస్

Read More Sports News And Telugu News

Latest news
Related news