Friday, March 31, 2023

Injury: రిషబ్ పంత్‌‌కు ఏమైంది..? బీసీసీఐ కొత్త వ్యూహమా..?

బంగ్లాదేశ్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ విషయమై బీసీసీఐ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైద్య నిపుణుల సలహా మేరకు వన్డే సిరీస్ నుంచి రిషబ్‌ను రిలీజ్ చేస్తున్నామనేది ఆ ప్రకటన సారాంశం. డిసెంబర్ 14న ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో పంత్ ఆడతాడని కూడా బోర్డు పేర్కొంది. పంత్‌కు రిప్లేస్‌మెంట్‌గా ఎవర్నీ ఎంపిక చేయలేదని బీసీసీఐ వెల్లడించింది. కాగా పంత్‌కు అసలు ఏమైంది..? అకస్మాత్తుగా అతణ్ని పక్కనబెట్టడానికి కారణాలేంటనే విషయమై ఎవరూ నోరు మెదపడం లేదు.

టాస్ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారని తెలిపాడు. దీన్ని బట్టి పంత్‌కు గాయమైందని అర్థం చేసుకోవచ్చు. ఆ గాయం నేచర్ ఎలాంటిదనే విషయం తెలియడం లేదు. కానీ పది రోజుల వ్యవధిలోనే అతడు గాయం నుంచి ఎలా కోలుకుంటాడనే ప్రశ్నను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరైతే కావాలనే పంత్‌ను పక్కనబెట్టారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్ సమయంలో సంజూ శాంసన్ అభిమానులు పంత్‌ను తెగ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

పంత్‌ను రిలీజ్ చేయడంతో.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాల్సి వస్తోంది. అంతే కాదు ఓపెనర్‌గా ఆడే రాహుల్ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో అందులోనూ కీలకమైన ఐదో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు. కుల్దీప్ సేన్ తొలి వన్డే ఆడుతుండగా.. సుందర్, షాబాజ్ అహ్మద్, షార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ల రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లతో భారత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని గెలవాలంటే ఎక్కువ మంది ఆల్‌రౌండర్లను ఆడించాలని భావిస్తోన్న బీసీసీఐ.. అందులో భాగంగానే పంత్‌కు రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించకుండా.. రాహుల్‌కు వికెట్ కీపర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిందని భావిస్తున్నారు. దీంతో అదనంగా ఓ ఆల్‌రౌండ్‌ను ఆడించే సౌలభ్యం మేనేజ్‌మెంట్‌కు లభించింది.

తొలి వన్డే మ్యాచ్‌కు ముందు రోజు.. పేసర్ మహ్మద్ షమీ భుజం గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్రాన్ మాలిక్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. గాయపడిన షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకోనున్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సైతం అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకోకపోవడంతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే.

* తొలి వన్డేలో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 11 ఓవర్లలో 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

Read More Sports News And Telugu News

Latest news
Related news