Sunday, April 2, 2023

సోహెల్ ఇంటి దగ్గర సాయం కోసం ప్రతిరోజూ ఎవరో ఒకరు ఉంటారు: మెహబూబ్

Authored by VaraPrasad M | Samayam Telugu | Updated: 4 Dec 2022, 10:17 pm

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ (Sohel Ryan) హీరోగా ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman) అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను తీసుకొచ్చారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిన్న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ సోహెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సోహెల్ గొప్పతనాన్ని వివరించాడు.

 

సోహెల్, మెహబూబ్

ప్రధానాంశాలు:

  • సోహెల్ ‘లక్కీ లక్ష్మణ్’ టీజర్ విడుదల
  • టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మెహబూబ్
  • సోహెల్ ఎంతో మందికి సాయం చేస్తున్నాడన్న మెహబూబ్
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ రియాన్ సోలో హీరోగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెలలోనే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా నిన్న టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో సోహెల్ స్నేహితుడు, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మెహబూబ్ మాట్లాడుతూ సోహెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

‘‘అందరూ లక్కీ లక్కీ అంటున్నారు. 10 సంవత్సరాల కష్టం ఇది. ప్రతిరోజూ నాకు ఫోన్ చేస్తాడు. షూటింగ్స్ చేస్తున్నానని, జిమ్‌‌కు వెళ్తున్నానని, తింటున్నానని చెప్తాడు. 24 గంటల్లో నాలుగు గంటలు మాత్రమే పడుకుంటాడు. ప్రతిరోజూ అంత కష్టపడతాడు. అలా కష్టపడే వ్యక్తికి సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ సినిమాతో సోహెల్ సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని మెహబూబ్ వెల్లడించాడు. ‘లక్కీ లక్ష్మణ్’ సాంగ్ చాలా బాగుందని.. విశాల్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారని మెహబూబ్ కొనియాడాడు.

‘లక్కీ లక్ష్మణ్’ సినిమా కోసం సోహెల్‌తో పాటు టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారని.. ప్రేక్షకులంతా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆదరించాలని మెహబూబ్ కోరాడు. ‘‘సోహెల్.. నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్. అదరగొట్టాలి.. చింపేయాలి. నీతో పాటు నువ్వు చాలా మందికి పని కల్పిస్తున్నావు. ఎంతో మందిని సపోర్ట్ చేస్తున్నావు. వీడు ఎంత మంచోడంటే.. ప్రతిరోజూ వీడి ఇంటి కింద ఎవరో ఉంటారు. అన్న కొంచెం హెల్ప్ చేయండి అన్న.. ఇంట్లో పరిస్థితి బాలేదన్న, మా అమ్మకు బాలేదన్న అని ఎవరో ఒకరు వస్తుంటారు. ఎవ్వరినీ కాదనకుండా వాడు చేయగలిగింది చేస్తాడు. లేకపోతే ఫ్రెండ్స్‌తో సాయం చేయిస్తాడు. నాకు ఫోన్ చేసి ఫోన్‌పే చేయరా అని అడుగుతాడు. సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి సాయం చేస్తున్నాడు. వీడు జెన్యూన్ పర్సన్. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చాడు. మనందరం వాడికి సపోర్ట్ ఒక మంచి హిట్ ఇద్దాం’’ అని మెహబూబ్ చెప్పుకొచ్చాడు.

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీ ఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ అభి దర్శకత్వం వహించారు. సోహెల్ సరసన మోక్ష హీరోయిన్‌గా నటించారు. దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, ఝాన్సీ, రచ్చ రవి, జబర్దస్త్ కార్తీక్, గీతు రాయల్ ఇతర పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఐ.ఆండ్రూ సినిమాటోగ్రాఫర్.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Latest news
Related news